Showing posts with label Sammakka. Show all posts
Showing posts with label Sammakka. Show all posts
30 May 2012
Medaram: Largest Tribal Religious Congregation in the World
వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్తగిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారు మన సమ్మక్క-సారక్క.
12వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను' పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటిప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాత వాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టక పోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం. కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాప రుద్రుడు అతడిని అణచి వేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు.
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.
తెలంగాణా కుంభమేళా:తెలంగాణా లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమె జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుకుమ భారినేలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతర కు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
విశిష్టతలు: ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరను UNESCO గుర్తించింది.
ఈ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు(ఫిబ్రవరి 8 నుండి 12 వరకు) ప్రారంభమయ్యే జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది. 2006 నుండి రాష్ట్ర ప్రభుత్వం జాతరను అధికారికంగా నిర్వహిస్తుంది.
Want to read in English click here
Subscribe to:
Posts (Atom)